V6 News

హెచ్‌‌‌‌సీయూలో బయటి వ్యక్తుల బరితెగింపు..పీహెచ్‌‌‌‌డీ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

హెచ్‌‌‌‌సీయూలో బయటి వ్యక్తుల బరితెగింపు..పీహెచ్‌‌‌‌డీ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
  • మరోసారి చర్చనీయాంశంగా వర్సిటీ భద్రతా వైఫల్యాలు 

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భద్రతా వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సెక్యూరిటీ పేరుతో మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించని అధికారులు.. క్యాంపస్​లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు.

తాజాగా ఇద్దరు పీహెచ్​డీ విద్యార్థినుల పట్ల బయటి వ్యక్తులు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. వర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న భూక్యా నవీన్ అనే విద్యార్థి బయటి వ్యక్తులైన తన ఫ్రెండ్స్ శరత్ బాబు, నవీన్, మరో ఆటో డ్రైవర్ చింటూను దొంగచాటుగా క్యాంపస్​లోకి పిలిపించి, ఎల్ -హాస్టల్ గదిలోనే ఆశ్రయం కల్పించాడు. వీరంతా రాత్రిపూట క్యాంపస్ ఆవరణలోని నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుతున్నారు.

వీరిలో ఒకరైన శరత్​బాబు మంగళవారం బైక్​పై క్యాంపస్​లోని రోడ్డుపైకి వచ్చాడు. లిఫ్ట్ ఇస్తాననే సాకుతో ఇద్దరు పీహెచ్‌‌‌‌డీ విద్యార్థినులను ఎక్కించుకున్నాడు. సౌత్ క్యాంపస్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బైక్ ఆపి, ఆ విద్యార్థినులను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వారు భయంతో కేకలు వేయడంతో ఓ విద్యార్థిని సెల్​ఫోన్ లాక్కుని పారిపోయాడు.

బాధితుల ఫిర్యాదుతో తోటి విద్యార్థులంతా ఏకమై హాస్టల్ గదులన్నీ గాలించి, నవీన్ రూమ్​లోనే దాక్కున్న ముగ్గురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేయగా, వర్సిటీలో భద్రతా లోపాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ  ఆందోళన చేపట్టారు.